టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం.. సచిన్ రికార్డు బద్దలు కొట్టనున్న వైభవ్?

భారత క్రికెట్‌లో ఓ సంచలనం చోటుచేసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసుకే అద్భుతమైన ప్రతిభతో వెలుగులోకి వచ్చిన యువ కెరటం వైభవ్ సూర్యవంశీ, త్వరలో టీమిండియా సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఐర్లాండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలక్టర్లు షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ పేరు కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 26 బంతుల్లో 78 పరుగులు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 17 బంతుల్లో 52, ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లో 39 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు, నిపుణులు గట్టిగా వాదిస్తున్నారు.

ఈ పరిణామాలపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా స్పందించారు. భారత జట్టులోకి అతి పిన్న వయసులో అరంగేట్రం చేసే రికార్డుకు వైభవ్ అర్హుడని ఆయన ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ చేశారు. ఇర్ఫాన్ పఠాన్, అనిల్ కుంబ్లే వంటి మాజీ దిగ్గజాలు కూడా వైభవ్‌కు జాతీయ జట్టులో చోటు కల్పించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు.

ఒకవేళ వైభవ్ ఐర్లాండ్ పర్యటనలో అరంగేట్రం చేస్తే, భారత క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం భారత పురుషుల జట్టు తరఫున అత్యంత పిన్న వయసులో ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉంది. ఓవరాల్‌గా మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ (15 ఏళ్ల 7 నెలల 27 రోజులు) ఈ రికార్డును కలిగి ఉంది. వైభవ్ అరంగేట్రం చేస్తే ఈ రెండు రికార్డులు బద్దలవుతాయి.

ఐర్లాండ్, ఆ తర్వాత జింబాబ్వే పర్యటనల కోసం ద్వితీయ శ్రేణి జట్టును పంపడం ద్వారా యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. "ఐర్లాండ్ పర్యటన కోసం పరిశీలిస్తున్న ఆటగాళ్ల జాబితాలో వైభవ్ పేరు కూడా ఉంది" అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ఈ పర్యటనల తర్వాత జరిగే ఇంగ్లండ్ సిరీస్‌కు మాత్రం సీనియర్ ఆటగాళ్లను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో వైభవ్‌కు ఐర్లాండ్ సిరీస్‌లోనే అవకాశం దక్కవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi India
Indian Cricket Team
Sachin Tendulkar record
Ireland tour
IPL
Rajasthan Royals
Arun Dhumal
Shafali Verma
Ajit Agarkar

More Telugu News